Tuesday, February 21, 2012

విద్య నీలోని అంతఃచేతన


వివేక సూర్యోదయం - ధారావాహికం - 2
 

విత్+య=విద్య అన్నారు. అంటే అంధకారమును పోగొట్టునది అని అర్థం. నరేంద్రుడు తన మనో వికాసాన్ని, అంధకారాన్ని వదిలించుకుని వివేకానందుడయ్యాడు. పశ్చిమగడ్డమీద  భారతీయ శంఖారావం పూరించాడు. భారత భాగ్యోదయ భానుడయ్యాడు. పశ్చిమ దేశాలలో అయన కొన్ని విషయాలు గమనించాడు.

బాగా చదువుకున్న వాళ్ళు కూడా, మన మతం గురించి మాట్లాడినప్పుడు ముక్కుపుటాలు 45 డిగ్రీల కోణంలో ఉంచి "అది కేవలం విగ్రహారాధన" అన్నారు. అది వారి సంకుచిత దృక్పథం. వారు డాలర్లను ఆరాధిస్తారు. ఆస్తులు కలిగి ఉంటారు. మట్టి ముద్ద అయినా, కనుగొన్న యంత్రమైనా, అవి కేవలం భౌతికమైన అధీనతకు అతీతంగా ఆలోచించాల్సినవే. విద్య నాగరికతను ఇనుమడింప చేయాలి. విజ్ఞతను పెంచాలి. 'మత సహనం' గురించి పుస్తకాల్లో చదవడము నాకు ఎక్కడా కనబడలేదు. మతసహనం, మతాన్ని గురించి సహకార భావన, సానుభూతి ఏమైనా ఉన్నాయి అంటే అది మనదేశంలోనే. అది భారతీయుల సొత్తు. అందుకే మహమ్మదీయులకు, క్రైస్తవులకు ప్రార్థనామందిరాలు ఇక్కడ కట్టించారు. ఇతర దేశాలకు వెళ్లి మహమ్మదీయులెవరైనా హిందువులకు ఆలయాలు కట్టించారేమో చూడండి. నిన్ను, నీ ఆలయాన్ని నిర్మూలించాలనే వీరు చూస్తారు. భారత్ నుంచి అందరూ నేర్చుకోవాల్సింది ఇదే. అంతటా ఉన్న పరమాత్మ ఒకరే అని. ఆంగ్లేయుల వలస పాలనలో ప్రతిరోజూ భారతీయులపై జరిగే అత్యాచారాల గురించి దినపత్రికల్లో చదువుతూనే ఉన్నాం. నేను బాధపడని రోజు లేదు. కాని తరువాత ఆలోచిస్తే దీనికి కారణం ఆంగ్లేయులు కాదు, మనమే అని అర్థమవుతుంది. హిందువులు ఆత్మ నిరీక్షణ చేసుకోవాలి. మన బాధలకు మనమే కారణమని బోధపడుతున్నది. సామాన్య ప్రజలు అహంకారపూరితులైన మన పూర్వుల పదఘట్టనల క్రింద నలిగి నిస్సహాయులై ఉన్నారు. పుట్టు బానిసలుగా, వారిని నమ్మించారు. గొప్పలు చెప్పుకునే మన ఆధునిక విద్యావిధానం వీరిని ఉద్ధరించలేక పోయింది. చదువుకున్న, చదువుకుంటున్న వారికి వీరి గురించి చెబితే తమ బాధ్యత నుంచి పారిపోయే విధంగా వణకడం నాకాశ్చర్యం కల్గిస్తోంది. దాన్ని వారి 'ఖర్మ'గా అభివర్ణించే అర్థం లేని వాదనలు కూడా వినబడుతుంటాయి. చదువుకున్నవారు ఈ నిస్సహాయుల్ని ఆదుకునేందుకు ముందుకు రాకపోతే వారు మోసగాళ్ళే అవుతారు. దీన్ని పరమోత్కృష్ట 'కర్మ'గా భావించి విద్యావంతులు ముందుకు రావాలి. అయినా ఈ దీనుల్ని ఉద్ధరించడానికి మనం ఎవరం? ఎవరికైనా సహాయం చేయాల్సివస్తే అందులో మన గొప్పదనం ఏదీ లేదు. మనకు మనం ఎక్కువగా ఊహించుకోనక్కరలేదు. వారిలో భగవంతుణ్ణి చూసి సేవ చేయాలి. అది మనకొక వరం. అదే చదువరులుగా మన సంస్కారం.

మన విద్య, విజ్ఞానం, పుస్తకాలు, ఉద్గ్రంధాలు ఇవన్నీ 'ఆత్మను తెలుసుకోవడం' గురించే నొక్కి వక్కాణిస్తున్నాయి. ఆత్మలోని చైతన్యాన్ని తెలుసుకోమంటున్నాయి. బెంగాలీ కవులు వ్రాసిన అనేక పాటలు, బెంగాలీ ప్రజల్లో వీథివీథినా, గ్రామ, గ్రామంలో పాడుకుంటారు. ఆ పాటల పరమార్థం 'ఆత్మశక్తి'ని గ్రహించడమే. భగవంతుణ్ణి తెలుసుకోవాలి, అనుభూతి చెందాలి, చూడాలి. ఆయనతో మాట్లాడాలి. ఇదే ఇక్కడ 'మత' భావనకు ముగింపు. దీన్ని అనుష్టించిన వేలాది భారతీయ సంతుల పరమోత్కృష్ట జీవనమే 'మత' భావనకు భూమిక నేర్పరిచింది. అందుకే విద్య మనిషిలోని 'ఉత్క్రుష్టత'కు ప్రకటీకృత రూపమైతే, మతం మనిషిలోని దైవత్వాన్ని ప్రకటిస్తుంది. అందుకే ఈ రెండు విషయాలలో దారిలోని ప్రతిబంధకాలు తొలగించడమే గురువు పని. దారిని శుభ్రం చేయడమే మనపని, మిగిలినవి భగవంతుడు చూసుకొంటాడు. అందుకే 'విద్య' అంటే కేవలం పుస్తకాలు నమిలేయడం కాదు. మనిషిని యంత్రంలా చేసేది విద్య కాదు. కేవలం మేధో వికాసమే కాదు, ఆత్మవికాసం కూడా సాధించాలి. ఆత్మవికాసం పొందిన వ్యక్తులతో ఏర్పడిన సమాజమే చైతన్యవంతమైన సమాజం అవుతుంది.

- హనుమత్ ప్రసాద్  

No comments:

Post a Comment