Thursday, March 8, 2012

కాశ్మీర్ లో వేర్పాటువాదం అనేది ఉన్నదా?

 
 
జనవరి 29వ తేదీనాడు "జమ్మూ కాశ్మీర్ నిజాలు - సమస్యలు - పరిష్కారాలు" అనే అంశంపై ఒక సదస్సు నిర్వహించబడింది. ఆ సదస్సులో జమ్మూ-కాశ్మీర్ అధ్యయన కేంద్ర ప్రముఖులు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత కార్యకారిణీ సభ్యులు శ్రీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ సమస్యపై ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారు. 

జమ్మూ కాశ్మీర్ మూడు భాగాలు. అవి 1) జమ్మూ, 2) కాశ్మీర్, 3) లద్దాక్. ఈ మూడు భాగాలలోని కాశ్మీర్ లో, అందులోనూ కాశ్మీర్ లోయలో జరుగుతున్న విషయాలు మాత్రమే దేశానికి, ప్రపంచానికి పత్రికా రంగం ద్వారా తెలుస్తున్నాయి. మిగిలిన భాగాలలోని ప్రజలు ఏమి మాట్లాడుతున్నారనే విషయం అసలు ప్రాధాన్యత లేనట్లుగా అక్కడి వ్యవహారాలు సాగుతున్నాయి. కాశ్మీర్ లోయలో కూడా 200 సున్నీ కుటుంబాలు చేస్తున్న అలజడి మాత్రమే వేర్పాటువాదం. జమ్మూ కాశ్మీర్ లోని 84% మంది ప్రజలు వేర్పాటువాదులు కాదు. ప్రత్యేక వాదులూ కాదు, వారు పూర్తిగా జాతీయవాదులు.


జమ్మూ కాశ్మీర్ లో 370 వ ప్రత్యేక అధికరణాన్ని కూడా చాలా వివాదాస్పదం చేసి దానిని దుర్వినియోగ పరుస్తున్నారు.
కాశ్మీర్ లోని అసలు సమస్యకు మూల కారణం డిల్లీలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగము, మానవ హక్కుల సంఘాల వాళ్ళు. అక్కడి తీవ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని అక్కడ ఉన్న సామాన్య ప్రజలు, జాతీయ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాశ్మీర్ అసలు సమస్య పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని విముక్తం చేయడం. దీనికి మన పార్లమెంటు 1994 ఫిబ్రవరి 22 న ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. పాక్ ఆక్రమణలోని కాశ్మీర్ ను విముక్తం చేయటమే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం. దాని గురించి ఏమి చేస్తున్నారో చెప్పరు. పైగా బయట మాత్రం మరోరకంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలు సరిగా ప్రజలకు అర్థం కావాలి.

పాకిస్తాన్ తో జరిగిన అన్ని యుద్ధాల సమయంలోనూ, అందులోనూ ముఖ్యంగా కార్గిల్ యుద్ధం సమయంలో అక్కడి సామాన్య ప్రజలు పాకిస్తాన్ పట్ల ఎలా స్పందించారో గమనించవలసిన అవసరం ఉంది. వారు అన్ని సమయాల్లో పాకిస్తాన్ ఆక్రమణను పూర్తిగా వ్యతిరేకించి, మన సైన్యానికి పరిపూర్ణంగా సహకరించారు.


మన ప్రభుత్వాలు మరో విషయాన్ని 1947 నుండి ఇప్పటి వరకు తేల్చటం లేదు. పాకిస్తాన్ నుండి, పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ నుండి దేశ విభజన సమయంలో తమ రక్షణ కోసం కాశ్మీర్ చేరిన 10 లక్షల మంది శరణార్థులకు రక్షణ లేదు. కనీసం వారికి మానవహక్కులు కూడా కల్పించటం లేదు. పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాల నుండి వచ్చినవారిని తిరిగి వారి స్థానాలకు సురక్షితంగా పంపేందుకు ఏమి చేస్తున్నారో చెప్పరు.


కాశ్మీర్ లో ఓ.బి.సి. కి రిజర్వేషన్లు లేవు. ఎస్.సి., ఎస్.టి. లకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఇవి ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పరు. కాని వేర్పాటువాదులతో చర్చలు జరుపుతామంటున్నారు. ఈ విషయాలు దేశమంతటా తెలియవలసిన అవసరం ఉంది. కాశ్మీర్ గురించిన మరిన్ని ఆసక్తికరమైన అంశాల గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాము.  
 
 http://www.lokahitham.net/2011/02/blog-post_183.html

No comments:

Post a Comment