Sunday, May 27, 2012

పని చేయడంలో పరమార్థం



 

మనిషిలోని కోరికలను ఎంత తగ్గిస్తే అంత వారికి సహాయం చేసినట్లవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానమే మన బాధలకు అడ్డుకట్ట వేయగలదు. మిగిలిన జ్ఞానం మన కోరికలు తీర్చేందుకే. కనుక ఆధ్యాత్మిక జ్ఞానం అందివ్వడమే పరమోత్కృష్ట సహాయమవుతుంది. బుద్ధిపరమైన జ్ఞానమివ్వడం తరువాతది. అజ్ఞానం మృత్యువు. జ్ఞానమే జీవితం. తరువాత వచ్చేది భౌతికంగా ఇతరులకు సేవ చేయడం. ఇది ఆఖరులో ఇచ్చేది. ఎందువలనంటే ఇందులో శాశ్వత తృప్తి లేదు. 'ఆకలి'ని ఏదో తిని చల్లార్చుకోవచ్చు. కాని మళ్ళీ ఆకలి రాకుండా మానదు. కనుక దీనికతీతంగా ఆలోచించే జ్ఞానం మనమివ్వాలి.

మనం నిరంతరం పని చేస్తూ ఉండాలని భగవద్గీత చెబుతోంది. ప్రతి పనిలో మంచి, చెడులుంటాయి. ఆయా ఫలితం దానికుంటుంది. పనిలో తాదాత్మ్యం లేనప్పుడు మన మనస్సుపై దాని ప్రభావముండదు. చేసే ప్రతి పని కొన్ని సంస్కారాలను కల్గిస్తుంది. ఇవి అంతర్లీనంగా పని చేస్తుంటాయి. ఇవి ప్రవర్తనను నిర్ణయిస్తాయి. ఇదే మన గుణమవుతుంది. మంచి పనులు చేస్తే మంచి గుణం వస్తుంది. చెడు పనులతో చెడు గుణం వస్తుంది. ఈ గుణమునకు దాసుడవుతాడు మనిషి.

మంచి పనులతో వచ్చే మంచి సంస్కారాలతో మనిషి ఇంద్రియ నిగ్రహుడవుతాడు. అప్పుడే 'సత్యం' తెలుస్తుంది. అతనెపుడూ సురక్షితంగా ఉంటాడు. అందుకే స్వామీజీలు అందరూ 'సత్సంగం' గురించి మాట్లాడుతుంటారు. సజ్జనుల సంఘటన కావాలన్నాడు శ్రీకృష్ణుడు. కాని ఈ మంచి తనమైనా, చెడు అయినా మనసుపై ముద్ర వేయని స్థితి నిజమైనది. చెడు పోయేందుకు 'మంచి' చేశాం. కాని అంతా మంచి అయిన తరువాత ఆ 'మంచి'ని ప్రత్యేకంగా చూపించే మమత్వం నుంచి బయటపడాలి. దాన్నే బంధ విముక్తి (Detachment) అంటారు. పని చేస్తూండాలి. కాని ప్రకృతి బంధంలో పడకూడదు. స్వేచ్చగా పని చేయాలి. లేకపోతే బానిసలుగా పని చేయాల్సి వస్తుంది. 99 శాతం మంది స్వార్ధం కోసం పని చేస్తున్నారు. ఫలితం బాధలు, కన్నీళ్ళే. బానిసగా పని చేసినపుడు ప్రేమించలేం. నిజమైన ప్రేమలో ఎవరికీ బాధ ఉండదు. ఉదాహరణకు ఒక పురుషుడు స్త్రీని ప్రేమించాడనుకుందాం. తను కోరుకున్నట్లే ఆమె ఉండాలి, ప్రవర్తించాలనుకోవడం ప్రేమ కాదు. అతడు ఆమెకు బానిసై, ఆమెను తన బానిసగా చేసుకుంటున్నాడు. అతను కోరుకున్నట్లు చేయకపోతే అతనికి బాధ కలుగుతుంది. బాధ కల్గించేది ప్రేమ కాదు. ప్రేమ ఆనందాన్నివ్వాలి. నీవు నీ భర్తను, భార్యను, పిల్లలను, ప్రపంచాన్ని, విశ్వాన్ని ఏమాత్రం స్వార్ధం లేకుండా, అసూయ లేకుండా ప్రేమించినట్లయితే నువ్వు బంధ విముక్తుడవే.

శ్రీకృష్ణుడు అర్జునుడితో 'అర్జునా! నేను ఒక క్షణం పని చేయడం ఆపితే ప్రపంచం నశిస్తుంది. పని చేయడం వల్ల నాకోచ్చేదేమీ లేదు. కాని ఎందుకు చేస్తున్నాను? ఎందుకంటే ప్రపంచాన్ని ప్రేమిస్తాను కాబట్టి. పిల్లల గురించి పని చేసే తండ్రి పిల్లల నుండి ఏమైనా ఆశిస్తాడా? దాన్ని బాధ్యతగా స్వీకరిస్తాడు. తిరిగి ఏమీ ఆపేక్షించడు. అదే మన ఆలోచన కావాలి. నిరపేక్షంగా చేసే పనిలో ప్రేమ ఉంటుంది. బంధాలుండవు. ఏదైనా అపేక్షిస్తేనే బంధనంలో పడిపోతాం. మన పెద్దలు దీన్నే 'నిష్కామ కర్మ' అన్నారు.

'పనికి తగ్గ కూలీ' వంటి మాటలు అన్నిచోట్ల వర్తించవు. ప్రతి పనిని 'కూలీ' ఇచ్చి చట్రంలో బిగించలేము. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే అనేక పనుల వల్ల ప్రపంచం నడుస్తోంది. ఇదే శాశ్వత సత్యం. ఇదే మనకు 'పని ద్వారా' కలగాల్సిన, మనం పొందాల్సిన జ్ఞానం.

- హనుమత్ ప్రసాద్

No comments:

Post a Comment