శ్యాంప్రసాద్ ముఖర్జీ |
1953 ఫిబ్రవరి 14 న పార్లమెంటులో శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రసంగిస్తూ కాశ్మీర్ సమస్యను గురించి నిర్మల హృదయంతో ఆలోచించమని ప్రభుత్వ నేతలకు విజ్ఞప్తి చేశారు.
"మనం ఒకరినొకరం నిందించుకోవద్దు. అలా చేసుకునేందుకు వేరే సందర్భాలు
వస్తాయి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. తనను, ప్రజా పరిషత్ ను మతతత్వం పేరుతో
జవహర్ లాల్ నెహ్రూ పదే పదే నిందించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన "ప్రధానమంత్రి
మా అందరినీ మతతత్వ వాదులుగా ముద్ర వేశారని నాకు తెలుసు. వాదంలో
గెలువలేకపోయిన ప్రతిసారీ ఆయన ఆ సమాధానాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ అసత్యమైన
ఆరోపణలతో నేను విసిగిపోయి ఉన్నాను. ఈ దేశంలో మతతత్వం ఉన్నదా? ఏదైనా రాజకీయ
పార్టీ బహిరంగంగానే దీనిని ఆశ్రయిస్తున్నదా? అన్న విషయాన్ని తేల్చడానికి
మనం ఒక తేదీని నిర్ణయించుకుని, చర్చిద్దాం. ముందు ప్రభుత్వాన్ని ఆరోపణలు
పెట్టమనండి. మేం వాటికి సమాధానం ఇస్తాం. ఈ దేశంలో మతతత్వం ఉండాలని మేం
ఎంతమాత్రం కోరుకోవడం లేదు. వివిధ మతాల ప్రజలు సమాన పౌరులుగా, సమాన హక్కులతో
జీవించే సమాజం నిర్మాణం కావాలనే మేం కోరుకుంటున్నాం. పరస్పరం అవమాన
పరచుకునేందుకు, ప్రయోజనాలు పొందేందుకు సంబంధించిన అంశం కాదిది. జాతీయ
ప్రాధాన్యత గల ఒక సమస్యను పరిష్కరించడానికి సంబంధించిన అంశం. ఈ అంశం తీవ్ర
సమస్యలను సృష్టించగలదు. దేశంలో అనేక ప్రాంతాలలో శాంతిని, సుఖాన్ని నాశనం
చేయగలదు. సమయం మించి పోకుండానే చర్య తీసుకోమని ప్రధానమంత్రిని నేను
అభ్యర్ధిస్తున్నాను".
http://www.lokahitham.net/2012/02/1953-14.html