Sunday, August 19, 2012

కాబోయే ప్రధానికి హిందుత్వంపై విశ్వాసం ఉండకూడదా?


నితీష్ కుమార్
ఇటీవలి రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలకు తెర లేచింది. ఎన్.డి.ఏ.లోని భాగస్వామ్య పక్షమైన జనతాదళ్(ఎస్) నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భా.జ.పా. బలపరిచిన అభ్యర్థి పి.ఏ.సంగ్మాను కాదని, యు.పి.ఏ. ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ అభ్యర్ధిత్వాన్ని బలపరిచాడు. నితీష్ కుమార్ రాజకీయ ఎత్తుగడలలో ఇది ఒక భాగం. గత కొంతకాలంగా సెక్యులర్ నాయకుడిగా తానూ గుర్తింపు పొందాలని ఆయన తాపత్రయపడిపోతున్నారు. వాస్తవానికి ఎన్.డి.ఏ. కూటమిలోనికి రాక ముందు బీహార్ రాజకీయాలలో నితీష్ పాత్ర అంతంత మాత్రమే. బి.జే.పి. సహాయంతో రెండు పర్యాయాలు బీహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తరువాత జాతీయస్థాయి నాయకుడిగా గుర్తింపు లభించింది. దాన్ని మరచి, భాజాపాలోని అనేక అంశాలపై తరచూ విభేదిస్తూ బీహార్ లోని ముస్లిం వర్గాలలో సెక్యులర్ నాయకుడుగా గుర్తింపు పొందటానికి తాపత్రయపడుతున్నారు. బీహార్ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీని ప్రచారానికి రాకుండా చేయటం కూడా అందులో ఒక భాగం.

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు నిరాకరించటమే కాకుండా 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బి.జే.పి. తరపున ప్రధానమంత్రిగా ప్రతిపాదించే వ్యక్తి "సెక్యులర్" వాది అయి ఉండాలని అనవసరమైన, అసందర్భ ప్రకటనను విడుదల చేశారు. రెండు సంవత్సరాల తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి, 185 పార్లమెంటు స్థానాలున్న భా.జ.పా. పార్టీకి సరిగ్గా 20 స్థానాలు కూడా లేని జనతాదళ్(ఎస్) నాయకుడు నితీష్ కుమార్ షరతులు విధించడం విడ్డూరమే. భా.జ.పా. అండతో పైకెదిగి భా.జ.పా.కే షరతులు విధించడం ఇంకా విచిత్రం. బీహార్ లో నితీష్ కుమార్ సెక్యులర్ నాయకుడుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికి భా.జ.పా.ను ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేయాలనుకొంటున్నట్లున్నది.

శ్రీ మోహన్ భాగవత్
కానీ దేశ ప్రధాని విషయంలో నితీష్ కుమార్ చేసిన ప్రకటనపై స్పందించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ ఒక సందర్భంలో మాట్లాడుతూ "ఈ దేశానికి కాబోయే ప్రధాని హిందుత్వ భావాలపై విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి అయి ఎందుకు ఉండకూడదు? అని ప్రశ్నించారు.

పై విషయం జాతీయ రాజకీయాలలో ఒక సంచలనమైన చర్చను తెర పైకి తెచ్చింది.


రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్.డి.ఏ. భాగస్వామ్య పక్షమైన జనతాదళ్(ఎస్) నాయకుడు నితీష్ కుమార్ ఎన్.డి.ఏ. అభ్యర్థిని వ్యతిరేకించగా యు.పి.ఏ. పక్షంలోని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ యు.పి.ఏ. ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించడం ఆసక్తికరం.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికలలో నూతన రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనా ఈ నూతన సమీకరణాల స్పష్టతకు ఇంకా కొద్ది రోజులు వేచి చూడవలసిందే. 


http://www.lokahitham.net/2012/02/blog-post_9991.html

No comments:

Post a Comment