Tuesday, October 9, 2012

అఖండ భారత్ సాధించాలిభారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఆగష్టు 15 కి 65 సంవత్సరాలు పూర్తి అయ్యి 66 వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. ఈ 65 సంవత్సరాలలో దేశం అనేక సంకట పరిస్థితులను ఎదుర్కొన్నది. అదే సమయంలో శక్తివంతం కావటానికి కూడా ప్రయాసపడుతున్నది. భారత్ శక్తివంతం కావటానికి ఒక రాజకీయ ధృడ సంకల్పము కావాలి.

భారతదేశం వేల సంవత్సరాల నుండి సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో ఏకత్వాన్ని సాధించింది. వాటిలో సమస్యలు ఉండవచ్చు. కాని దేశమంతటా ఒక ఏకత్వము కనబడుతుంది. ఈ దేశంలో జన్మించిన వేద కాలం నాటి ఋషులు కావచ్చు, మహా భారతకాలం నాటి వేదవ్యాసాది ఋషులు కావచ్చు. ఎవరైనా తమ ఆలోచనలను దేశమంతటా విస్తరింపచేశారు. ఈ దేశం సాంస్కృతికంగా, సామాజికంగా వేల సంవత్సరాల నుండి ఒక్కటిగా వికశించి సుధృడంగా నిలబడింది. ఇది పటిష్టం కావాలంటే రాజకీయ స్థిరత్వం కూడా కావాలి. సంస్కృతి, సామాజిక ఏకత్వం కారణంగా ఈ దేశ చరిత్రలో రాజకీయ స్థిరత్వం సాధించి మన దేశంపై జరిగిన విదేశీ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవటమే కాకుండా ఆ శక్తులను సమూలంగా నాశనం చేయగలిగాము. అటువంటి సంకల్ప శక్తి కొరవడిన కారణంగానే ఇస్లాం, బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణలను ఎదిరించేందుకు ఈ దేశం ఎంతో మూల్యం చెల్లించింది. అంతిమంగా స్వాతంత్ర్యం సంపాదించుకొంది. అయినా బ్రిటిష్ వాళ్ళ రాజకీయ తంత్రం నుండి పూర్తిగా బయట పడలేక ఈ రోజున దేశం ఎంతో ప్రయాస పడుతున్నది. 

బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోని సాంస్కృతిక ఏకత్వం, ఈ దేశ సామాజిక, ఆర్ధిక సూత్రబద్ధత గమనించి దీనిని దెబ్బ తీయలేకపోతే ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించలేమని నిర్ధారించుకొని, ఈ దేశ ప్రజలలో విభేదాలు సృష్టించారు. ఈ దేశం "ఒకే దేశం కాదు" అని ప్రచారం చేశారు. అసలు ఈ దేశం ఎప్పుడూ ఒకే పాలనలో లేదు. రాజకీయంగా ఈ దేశం ఒక్కటి కాదు అని ప్రచారం చేశారు. దాని నుంచి ఎంతో లబ్ది పొందారు. అంతవరకూ బాగానే ఉంది. కాని వారు సృష్టించిన భ్రమల్లో పడి ఆ రోజు నుండి ఈనాటి వరకు అట్లాగే ఆలోచిస్తున్న మన మేధావులు కొందరు మనకు కనబడతారు. వారి వ్యవహారం ఎట్లా ఉన్నదంటే తాము ఎక్కిన కొమ్మను తామే నరుక్కొంటున్నట్లుగా ఉంది. ఇటువంటి మేధావులే స్వతంత్ర భారతదేశంలో రాజకీయ స్థిరత్వం రాకుండా ఉండేందుకు కారణమవుతున్నారు.

భారతదేశంలో రాజకీయ ఏకత్వం, ఏక కేంద్రిత పాలన తీసుకొని వచ్చేందుకు అనేక సఫల ప్రయోగాలు సాగాయి. దాని కారణంగా ఈ దేశం మీద దురాక్రమణ దారులను సమూలంగా నాశనం చేయగలిగాము. దేశం ఆర్థికంగా కూడా శక్తివంతమైంది. అందులో శాలివాహన సామ్రాజ్యం దీర్ఘకాలం ఈ దేశాన్ని పాలించింది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో కూడా ఈ దిశలో ఒక విఫల ప్రయోగం జరిగింది. దాని సఫలతగా ఆ తదుపరి కాలంలో జాతీయ ఉద్యమాల నిర్మాణం జరిగింది. ఈ ప్రయత్నాలలో అనేకమంది భాగస్వామ్యం ఉంది. వాటి నుండి పాఠాలు నేర్చుకొని స్వతంత్ర భారతాన్ని శక్తివంతం చేసుకోవాలి. కాని ఆ దిశలో ప్రయత్నాలు సాగుతున్నాయా? అనిశ్చిత పరిస్థితులను మనకు మనమే నిర్మాణం చేసుకొంటున్నాము. దేశంలో రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుకొని దేశం ఆర్థికంగా, రాజకీయంగా శక్తివంతం కావటానికి ధృడ సంకల్పం గల ఒక జాతిగా మనం నిర్మాణం కాగలుగుతున్నామా? అసలు ఒక జాతిగా మనం ఆలోచిస్తున్నామా? ఈ దేశ పౌరుడిగా మనకు మనం అంతర్ముఖులం కావలసిన అవసరం ఉంది.

ఏ రాజకీయ ధృడ సంకల్పము కావాలో అది లేని కారణంగా ఈ దేశం 1947 ఆగష్టు 14 న రెండు ముక్కలయింది. ప్రపంచ పటంలో అకస్మాత్ గా ఒక నూతన దేశం అవతరించింది. ఈ విషయం కనీసం మనకు స్ఫురణకు ఉందా? 1932 నుండి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఎలా ముక్కలుగా చేసుకొంటూ వచ్చారో మనకు ఎవరికీ స్ఫురణకే లేదు. ఒకప్పుడు భారతదేశం 56 రాజ్యాలుగా ఉండేది. ఆ రాజ్యాల పేర్లు అనేక సందర్భాలలో వింటూ ఉంటాము. కాని ఆ రాజ్యాలు ఈ రోజు ఏవేవి స్వతంత్ర దేశాలుగా ఉన్నాయి? మన దేశం ఎట్లా ముక్కలు చేయబడిందో గ్రహింపునకు వస్తున్నదా? ఆ పేర్లు వింటూనే ఉంటాము కాని అదంతా ఒకప్పటి అఖండ భారత్ అనే భావం నిర్మాణం కావటం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత
అంతర్జాతీయ లాబీ ఒకటి ఏర్పడి, శక్తివంతమై, ప్రపంచంలోని అనేక దేశాలను ముక్కలు చేసింది. ప్రపంచ పటంలో కొత్త దేశాలు అవతరించాయి. కాని కాలక్రమంలో ఆ దేశాలు తమ మాతృ దేశాలతో కలిసిపోతున్నాయి. ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నాయి. కాని మన దేశంలో మన అఖండ భారత్ ను తిరిగి సాధించుకోవాలనే ఆలోచనే శక్తివంతం కావటం లేదు. 1947 ఆగష్టు 15న అరవిందుడు "దేశ విభజన సమసిపోవాలి, అఖండ భారత్ నిర్మాణం కావాలి, అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, శక్తివంతమవుతుంది" అని హెచ్చరించారు.

భారతదేశం నుండి విభజింపబడిన దేశాలలో పరిస్థితులు సజావుగా ఉన్నాయా? సమస్యలు లేవా? అంటే అన్ని దేశాలు సమస్యలను ఎదుర్కొంటూనే ఉనాయి. ప్రక్క ప్రక్కనే ఉన్న మన సమస్యలు పరిష్కరించుకోవటానికి కలిసి ఆలోచిద్దాం అని అనుకోవటం లేదు. దానికి ప్రధాన కారణం భారత్. భారత్ శక్తివంతంగా ఆ బాధ్యతను తీసుకోన్నప్పుడే ఆ ఆలోచనలు సాధ్యమవుతాయి. అప్పుడే అఖండ భారత్ నిర్మాణమవుతుంది. ప్రపంచానికి సరియైన దిశా నిర్దేశం చేయగలుగుతుంది. ఇది చేయాలంటే రాజకీయ స్థిరత్వం రావాలి. దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకొని దేశ ప్రజలు ఆలోచించాలి. కాశ్మీరు సమస్య కాని, అస్సాంలో అక్రమ వలసదారుల దౌర్జన్యాలతో జరుగుతున్న గొడవలు కాని ఇంకేదైనా కాని అవి అన్ని ఈ దేశ ప్రజలందరికి సంబంధించిన సమస్యలు అనే భావం స్థిరపడితే అప్పుడు కలిగే ఆగ్రహం రాజకీయ నాయకుల ఎత్తుగడలను వమ్ము చేసి వారిని దేశ సమగ్రతను గురించి ఆలోచించేట్లుగా చేస్తుంది. అప్పుడు ఈ దేశం సంపూర్ణ స్వతంత్ర దేశంగా వ్యవహరించగలుగుతుంది. అటువంటి మార్పుతో దేశం రాజకీయ స్థిరత్వం సాధించగలుగుతుంది. దేశం అజేయ శక్తిగా నిలబడ గలుగుతుంది. 

No comments:

Post a Comment