సిద్ధిపేట శిబిర సార్వజనికోత్సవంలో ప్రసంగిస్తున్న శ్రీ వేణుగోపాల్ రెడ్డి |
వరంగల్ శిబిర సార్వజనికోత్సవం
వరంగల్ నగరంలో రెండు రోజులపాటు జరిగిన తరుణ శిబిరం ముగింపు కార్యక్రమంలో (సార్వజనిక సభ) పశ్చిమ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ ఆలే శ్యాంకుమార్ వక్తగా పాల్గొని ప్రసంగించారు.
"హిందూ సమాజం జాగృతమైతేనే దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్.ఎస్.ఎస్. గత 86 సంవత్సరాల నుండి దేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసే పనిలో ఉందని" వారు అన్నారు. ఇంకా మాట్లాడుతూ -"హిందూ సమాజాన్ని శక్తివంతం చేయడం కోసం సంఘం కంటే ముందు లోకమాన్య బాలగంగాధర తిలక్, పండిత మదన మోహన్ మాలవీయ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి మహా పురుషులు కృషి చేశారు. పెరుగుతున్న హిందువుల ఐక్యత, బలాన్ని చూసి మనలను దెబ్బ తీయాలని కొన్ని బలీయమైన శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందుకే హిందూ శ్రద్ధా కేంద్రాలపై, స్వామీజీలపై, తిరుమల తిరుపతిపై, అమరనాథ్, రామసేతు వంటి ఆరాధనా స్థలాలను ధ్వంసం చేసే కుట్ర జరుగుతున్నదని" అన్నారు. "ఒకవైపు ఉత్తరాన చైనా, పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున బంగ్లా వంటి దేశాలు అదును చూసి కాటువేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ నాదంటూ మ్యాప్ లో చూపెడుతున్నది చైనా. మరోవైపు లద్దాక్ లోకి చొరబడి వచ్చింది. మిస్సైల్స్ ఏర్పాటు చేసి మన ముఖ్యనగరాలపై గురిపెట్టింది. బ్రహ్మపుత్ర నదిపై 10 ఆనకట్టలు కట్టి మనదేశంలో అతివృష్టి, అనావృష్టి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది.
వరంగల్ శిబిరం ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న పశ్చిమ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ ఆలే శ్యాంకుమార్ |
బంగ్లాదేశ్ నుండి 4 కోట్లమంది అక్రమంగా మనదేశంలోకి చొరబడి అన్ని నగరాల్లో చేరి కుట్రలు, గూఢచర్యం చేస్తూ, మారణకాండ సృష్టిస్తున్నప్పటికి మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. కాని వారి ఓట్ బ్యాంకు కోసం ఒబిసి కోటలో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారాన్ని ఎరగా చూపి ఓట్లు దండుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థితిని ప్రశ్నించే నాయకులు, నేతలు నేడు కరువయ్యారు. ఈ మధ్య కాలంలో హిందూ తీవ్రవాదం అనే కొత్త పదాన్ని వినియోగిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో హిందువులు వేరేవరిపై దాడి చేసిన సంఘటనలు ఇంతవరకు లేవు. ఇటువంటి స్థితులను గమనిస్తూ హిందూ సమాజం జాగృతం కావాలి" అని శ్రీ శ్యాం కుమార్ పిలుపునిచ్చారు.
ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మతహింస బిల్లు చట్టం-2011ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్నది. ఈ బిల్లు అమలయితే మెజార్టీ వర్గంవారంతా నేరస్తులవుతారు. ఇటువంటి బిల్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉన్నది" అంటూ శ్యాంజీ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డు కమాండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సౌమిత్రి మాధవాచార్య, ప్రాంత సంఘచాలక్ శ్రీ టి.వి. దేశ్ ముఖ్ తదితరులు పాల్గొన్నారు.
సిద్ధిపేట శిబిర సార్వజనికోత్సవం
సిద్దిపేటలో జరిగిన శిబిర సార్వజనికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా.రాజేందర్ గారు మాట్లాడుతూ -"తల్లి-పిల్లలమధ్య, ప్రేమికుల మధ్య ఏ చట్టాలూ ఉండవు, భార్యాభర్తల మధ్య చట్టలుంటాయి. వ్యక్తుల మధ్య ప్రేమ ఉండాలి, ప్రేమ, అత్మీయభావం అన్నిటికంటే ముఖ్యమైనవి. దాంతో అన్ని పనులు సాధ్యమవుతాయన్నారు.
ఈ సార్వజనికోత్సవంలో శ్రీ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య వక్తగా పాల్గొన్నారు. వారు ప్రసంగిస్తూ -"ఒక వారం రోజుల క్రితం రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శ్రీ సుబ్బారావుగారు తన మిత్రుని కలిసేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ 'ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పటికే ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాని ప్రభావం మనదేశంపై కూడా పడింది. రాబోవు కొద్ది నెలలలో అంతకంటే పెద్ద సంక్షోభాలు ఎదుర్కొనబోతున్నాము. వాటిని మనం అధిగమించాలని' అన్నారు. బయటి దేశాలలో బడ్జెట్ కేటాయింపులలో సామాజిక బడ్జెట్ ఉంటుంది. అదే అక్కడి ప్రభుత్వాలకు పెద్ద భారం. మన దేశంలో కుటుంబాలలోని వ్యక్తులు తమ కుటుంబంలోని సమస్యలను, అవసరాలను పరిష్కరించుకోవడం తమ బాధ్యత అనుకుంటారు. దానికి చట్టాలు అవసరం లేదు. ఈ రోజున దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందకు ఒక్కరికి, ప్రయివేట్ రంగంలో 6గురుకి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాయి. మిగిలిన 92 మంది స్వతంత్రంగా బ్రతకాలి. అందరమూ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని కోరుకోవటం సాధ్యం కాదు. కాబట్టి చదువు పిల్లలకు జ్ఞానం పంచిపెట్టాలి. స్వతంత్రంగా పనులు చేసుకోగలగాలి. సమాజంలో అవినీతిని తొలగించేందుకు, సమస్యలను ఎదుర్కొనేందుకు, అవినీతికి తావివ్వకుండా ఉండే వ్యక్తులు స్వయంసేవకులవ్వాలి. ఉదాహరణగా నిలబడగలగాలి. అప్పుడే వ్యవస్థ మారుతుంది.
ఈ రోజున రాజకీయాల నుండి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియకపోవడం వలన రాజకీయ నాయకుల దోపిడీ ఎక్కువైంది. దీనిని అరికట్టేందుకే ప్రభుత్వం పౌరుల కొరకు ఈ మధ్య ఆర్.టి.ఏ.చట్టం ఒకటి ఏర్పాటు చేసింది. ఈ చట్టం ఆధారంగా కేవలం 10 రూపాయలు చెల్లించి మనకు కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పని చేయడం వల్ల అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి అవినీతి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. గ్రామాలలో బీదలు వైద్యం కొరకు దూరప్రయాణం చేయవలసి వస్తే రూ.50 ఇస్తారు. కాని ఈ విషయం అందరికీ తెలియదు. ఈ పథకం కోసం గ్రామ పంచాయతీకి వచ్చే రూ. 50000 దుర్వినియోగమవు తున్నాయి. ఇది పట్టించుకోవాలి. హ్యాండ్ పంపు రిపేరుకు రూ.750 ఇస్తారు. అది దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికి ఉన్నది. సంఘ స్వయంసేవకులు ఇటువంటి విషయాలలో కూడా శిక్షణ పొందాలి. నాగపూర్ నుండి అన్నీ చెప్పరు. పరిస్థితులననుసరించి పెనుమార్పుకు అందరం కృషి చేయాలి.
http://www.lokahitham.net/2012/01/blog-post_03.html
No comments:
Post a Comment