Wednesday, February 15, 2012

హిందుత్వమే యావత్ ప్రపంచ సమస్యలకు పరిష్కారం



భారతదేశాన్నికలిపి ఉంచేది కేవలం హిందుత్వం మాత్రమే. అది సార్వజనీనమైనది. హిందుత్వం భారత దేశానికే కాక ప్రపంచ సమస్యలను కూడా పరిష్కారం చూపుతుంది" అని మోహన్ జీ భాగవత్ మాట్లాడుతూ చెప్పారు. హుబ్లీలో జరిగిన విశాల హిందూ శక్తి సంగమంలో పాల్గొని వారు ప్రసంగించారు. 

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నిర్మాత డా.కేశవరావు బలిరాం హెడ్గేవార్ కర్ణాటక ఉత్తర భాగంలో ఉన్న చిక్కోడి శాఖకు 1937వ సంవత్సరం జనవరి 16న పర్యటనకు వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ 75 సంవత్సరాల కాలఖండంలో అక్కడ సంఘ పని విస్తరించింది. ఈ సందర్భంగా "హిందూ శక్తి సంగమం" పేరుతో ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు స్వయంసేవకుల  శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాలకు చెందిన 1894 గ్రామాల నుండి 21 వేల 554 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. మూడురోజుల పాటు జరిగిన ఈ శిబిరంలో పరమ పూజనీయ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ భయ్యాజీ జోషి, క్షేత్ర సంఘచాలక్, ప్రాంత సంఘచాలక్ తదితర సంఘ పెద్దలు పాల్గొన్నారు. సార్వజనికోత్సవంలో మా. శ్రీ మోహన్ భాగవత్ ప్రసంగించారు. వారి ప్రసంగం సంక్షిప్తంగా...
 

"భారతదేశంలోని ప్రజలలో భాష, ఆహారం, శీతోష్ణ పరిస్థితులు మొదలైన వాటిలో ఎంతో వైవిధ్యం కనబడుతుంది.  జీవనవిధానం, సంస్కృతిలో మాత్రం ఏకత్వం కనబడుతుంది. అదే హిందుత్వం, హిందూ రాష్ట్రం. ఈ సిద్ధాంతం సార్వజనీనమైనది. సర్వ కాలాలకు వర్తిస్తుంది. ఈ ఆలోచనా విధానం ముందుంచుకొని మన పూర్వీకులు మెక్సికో నుండి ఇండోనేషియా వరకు ప్రపంచమంతా తిరిగారు. వారు వెళ్ళిన చోటల్లా అక్కడి ప్రజలకు యోగ, చక్కటి జీవన విధానం నేర్పించారు. జీవితానికి సంబంధించిన శాశ్వత విలువలు అక్కడి ప్రజలకందించే ప్రయత్నం చేశారు. డాక్టర్ అబ్దుల్ కలాం మాట్లాడుతున్నప్పుడు అనేకసార్లు  "మన జాతి శక్తిని ఆరాధించడం గత వెయ్యి సంవత్సరాలుగా మరచిపోయింది. ఆ శక్తిని తిరిగి ఆరాధించడం మనం చెయ్యాలని" చెబుతూ ఉంటారు. ఆ పనిని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం గడిచిన 86 సంవత్సరాలుగా చేస్తున్నది. హిందూ సమాజాన్ని శక్తివంతం చేసి భారత్ ఒక అజేయమైన శక్తిగా నిర్మాణం చేసే పనిని మనం చేసుకుంటూ వస్తున్నాం. చక్కటి ఒక సామాజికావసరం కోసం శక్తి ఉపయోగ పడాలి. శక్తి మాత్రమే కాదు, దానికి శీలం (వ్యక్తిత్వం) జోడించబడాలి. అప్పుడే శక్తి సమాజానికి సకారాత్మకంగా ఉపయోగపడుతుంది. భారతదేశం పైన అనేక ఆక్రమణలు జరిగాయి. అవి ఏవీ ఈ జాతిని సంపూర్ణంగా విచ్ఛిన్నం చేయలేకపోయాయి. మనదేశంలోని ఈ అంతర్గత శక్తే ఆక్రమణలను ఎదిరించి నిలబడేట్లు చేయగలిగింది.  ఈ రోజున ఈ దేశానికి సామాజిక కార్యం కోసం శీలం కలిగిన శక్తివంతులు కావాలి. అప్పుడే మనకు ఎదురవుతున్న అనేక సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాము. ఇటువంటి శక్తితో ఈ దేశ సమస్యలే కాదు, ప్రపంచం ఎదుర్కొంటున్న ఉగ్రవాదం మొదలైన అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొనవచ్చు. వాటిని అధిగమించేందుకు భారత్ శక్తివంతం కావాలి. ఆ పనినే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చేసుకొంటూ వస్తున్నది. అదే వ్యక్తి నిర్మాణం.

ఈ దేశం మనకు భౌగోళిక భూభాగం మాత్రమే కాదు. ఇది మన అందరికి మాతృభూమి. ఈ దేశాన్ని మాతృభూమిగా వేల సంవత్సరాల నుండి ఆరాధిస్తూ వస్తున్నాము. అందుకే మన పెద్దలు దానిని "మృణ్మయ" అంటారు. ఏ కాలంలోనైనా సమాజం మూడు విషయాలపై శ్రద్ధ ఉంచాలి. 1) మన మాతృభూమి ఎడల శ్రద్ధ, 2) మన సంస్కృతి ఎడల గర్వకారణం, 3) మన పూర్వీకుల ఎడల ఆరాధ్య భావం. ఈ మూడు విషయాలను అనుసరించేవాడు హిందువు. అప్పుడే ఈ భౌగోళికమైన నదులు, పర్వతాలు, ప్రకృతి ఎడల ఒక ఆరాధనా భావం ఉంటుంది. 

జాతీయ సమైక్యత కోసం అన్ని రంగాలలో మనం పని చెయ్యాలి. అందరిని కలుపుకొని పోవాలని సంఘం స్వయంసేవకులకు చెబుతుంది. దేశవ్యాప్తంగా ఈ రోజున సంఘ స్వయంసేవకులు 1.5 లక్షల సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి సంభవించినప్పుడు పోలీసులు, సైన్యం కంటే ముందుగా స్వయంసేవకులు అక్కడికి చేరుకొని పని చేస్తుంటారు. ఈ విధంగా స్వయంసేవక్ సకారాత్మక దృష్టితో రాష్ట్ర ఉన్నతి కోసం పని చేస్తుంటాడు.

మన దేశంలో జనతా జనార్ధనుడు అనే మాటను ఉపయోగిస్తాము. సామాన్య ప్రజల ఆలోచన అభిప్రాయాలే ప్రాధాన్యత కలిగినవి. అంతేగాని రాజకీయ నాయకులే సర్వస్వం కాదు. ఈ రోజున సామాన్య ప్రజలలో జాతీయ దృష్టికోణం అంతగా కనబడని కారణంగా కాశ్మీర్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, ఆక్రమణలను నిలువరించగలిగే శక్తి ఈ దేశంలో నిర్మాణం కావాలి. శక్తివంతమైన సమాజం ఉంటేనే శక్తివంతమైన పాలనా వ్యవస్థ కూడా ఉంటుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలలో స్వయంసేవకులు పాల్గొంటున్నారు. సంఘం ఆ ఉద్యమాలన్నింటిని సమర్ధిస్తున్నది. అన్ని రకాల అవినీతిని అంతమొందించడానికి వ్యక్తులలో నైతిక విలువలు పెంచవలసిన అవసరం ఉందని" చెబుతూ మోహన్ జీ ప్రసంగాన్ని ముగించారు. 


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్త డాక్టర్ వి.జే.సుందరం మాట్లాడుతూ "1947లో భారత్ కు రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే వచ్చింది. ఆ రోజుల్లో దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. దేశాన్ని ఆర్థికంగా శక్తివంతం చేసుకోవాలి. దేశంలో సస్యవిప్లవం, సాంకేతిక రంగంలో విప్లవం సాధించాము. ఈ రోజున మనం దేశ సంరక్షణకు అనేక శక్తివంతమైన క్షిపణులను నిర్మాణం చేసుకొన్నాము.  ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణి పరిజ్ఞానం మనది. పృథ్వీ క్షిపణి చాల శక్తివంతమైనది. ఈ సాంకేతిక పరిజ్ఞానం వెనుక అబ్దుల్ కలాం చాలా కీలకమైనవారు. ఈ కార్యక్రమంలో స్వయంసేవకుల క్రమశిక్షణ ఇవన్నీ నన్ను ఎంతో ఆకట్టుకొన్నాయి. ఈ రోజున దేశానికి అవసరమైన క్రమశిక్షణ నాకు ఇక్కడ కనబడుతున్నది" అని చెప్పారు. 

 http://www.lokahitham.net/2011/02/blog-post_08.html

No comments:

Post a Comment