Tuesday, December 27, 2011

సరిహద్దులలో పొంచి ఉన్న ప్రమాదం - నిరంతర జాగరూకతే ప్రజల కర్తవ్యం

ఆర్. ఎస్. ఎస్.అఖిల భారత కార్యకారీ మండలి తీర్మానం
గోరఖ్ పూర్ - 2011 

వేదికపై పూజ్య సర్ సంఘచాలక్ మా. శ్రీ మోహన్జీ భాగవత్, సర్ కార్యవాహ మా.శ్రీ భయ్యాజీ జోషి.
జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్న పరిణామాల పట్ల రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నది. కలియుగాబ్ది 5113 ఆశ్వయుజ బహుళ విదియ నుండి మూడు రోజుల పాటు అనగా క్రీస్తు శకం 2011 అక్టోబర్ 14 నుండి 16 వరకు ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగిన సంఘ 'అఖిల భారత కార్యకారీ మండల్' సమావేశాలలో దేశ భద్రతను పరిరక్షించి పెంపొందించడానికై సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని  కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానం క్రింది విధంగా ఉన్నది.

దేశ సరిహద్దుల వెంబడి నెలకొని ఉన్న ఉద్రిక్తతలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని 'అఖిల భారత కార్యకారీ మండల్' నిరసిస్తోంది. విచ్ఛిన్న వాదులకు, బీభత్స కారులకు సరిహద్దులకు ఆవల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం గురించి కాని, మన గగన తలానికి, సముద్ర సీమలకు ఎదురౌతున్న ప్రమాదాల గురించి కాని, అంతరిక్షంలోను, అంతర్జాతీయ జలాలలోను మన దేశానికి విరుద్ధంగా విస్తరిస్తున్న వైపరీత్యాలను గురించి కాని మన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మన ప్రాదేశిక సమగ్రతకు విఘాతకరంగా పరిణమిస్తున్న ప్రమాదాల గురించి మన ధ్యాస పెరగాలి. 

కవ్విస్తున్న చైనా 
చైనా సైనిక దళాలు నిరంతరం మన సరిహద్దులను ఉల్లంఘించి చొరబాట్లు కొనసాగిస్తునారు. సరిహద్దు ప్రాంతాలలోని మన సైనిక స్థావరాలను జనావాసాలను ధ్వంసం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తున్నారు. మన ఇరుగు పొరుగు దేశాలలో చైనా ప్రభుత్వం సైనిక స్థావరాలను ఏర్పరచుకొంటోంది. ఆ దేశాలతో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకొంటోంది. ఈ చర్యల ద్వారా మన దేశాన్ని నలువైపుల నుంచి సైనిక దిగ్బంధం చేయాలన్నది చైనా ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం! ఈ పరిణామాల గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి. చైనా ప్రభుత్వం పాకిస్తాన్ కు ఆయుధాలను, ఇతర యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తోంది. పాకిస్తాన్ లోని భారత వ్యతిరేక బీభత్సకారులను (టెర్రరిస్టులను) ప్రోత్సహిస్తోంది.  పాకిస్తాన్ దురాక్రమణలో ఉన్న కాశ్మీర్లో చైనా సైనికులు తిష్ఠ వేసి ఉన్నారు. మావోయిస్టులు మాధ్యమంగా నేపాల్ లోని ప్రభుత్వ యంత్రాంగాన్ని తన అదుపులో ఉంచుకొనడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్, బర్మా (మయన్మార్), శ్రీలంక వంటి మన పొరుగు దేశాలకు చైనా సైనిక నిపుణులు విరివిగా రాకపోకలు సాగిస్తున్నారు. మన దేశాన్ని వ్యూహాత్మకంగా దిగ్బంధించాలన్న చైనా ప్రభుత్వ విధానంలో ఇవన్నీ భాగం. 

సరిహద్దులకు ఆవల నుంచి బీభత్స కారులను, విచ్ఛిన్న వాదులను మన దేశానికి వ్యతిరేకంగా ఉసికొల్పడం మాత్రమే కాదు, మన ఈశాన్య ప్రాంతంలోని దేశ విద్రోహక ముఠాలకు చైనా ప్రభుత్వం బాహాటంగా సహాయం చేస్తున్నది. ఇది మన జాతి సమైక్యతకు, ప్రాదేశిక సమగ్రతకు ప్రమాద కరంగా పరిణమించింది. చైనాకు చెందిన 'సైబర్' సాంకేతిక పరిజ్ఞాన వేత్తలు రహస్యంగా మన 'సమాచార వినిమయ వ్యవస్థ' (ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ సిస్టం) లోనికి చొరబడిపోతున్నారు. అతి తక్కువ వ్యయంతో అమలు జరుపడానికి సిద్ధపడడం ద్వారా చైనా సంస్థలు రక్షణపరంగా కీలకమైన ప్రాంతాలలోని మన పథకాలను హస్తగతం చేసుకొంటున్నారు. తద్వారా చైనా ప్రభుత్వం తన గూఢచర్య  వ్యవస్థను మన దేశంలో విస్తరించు కొంటోంది. ఇలాంటి పరిణామాలు మన దేశ భద్రతా వ్యవస్థను భగ్నపరుస్తున్నాయని 'అఖిల భారత కార్యకారీ మండల్' భావిస్తున్నది.

క్రీస్తుశకం 1962 వ సంవత్సరంలో చైనా ప్రభుత్వం దురాక్రమించిన 38 వేల చదరపు కిలోమీటర్ల మన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ అదే సంవత్సరం నవంబరు 14 వ తేదీన మన పార్లమెంటు ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మరచిపోయింది. మన దేశానికి చెందిన మరో 90 వేల చదరపు కిలోమీటర్ల భూమి తమదని చైనా ప్రభుత్వం చేస్తున్న వాదానికి మన ప్రభుత్వం ధీటైన సమాధానం చెప్పడం లేదు. మనపై మళ్ళీ దాడి చేయడానికి చైనా ప్రభుత్వం సర్వ సమగ్ర సైనిక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతిఘటించడానికి వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకొనడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్న జాడ లేదు.

మన సరిహద్దుల పొడవునా చైనా ప్రభుత్వం 'సుదూర ఖండాంతర లక్ష్యచ్చేదక  అణ్వస్త్ర వాహక క్షిపణుల' (ఇంటర్ కాంటినెం టల్ బాలిస్టిక్ మిస్సైల్స్ - ఐసిబిఎమ్) ను మోహరించింది. ఈ అణు క్షిపణులు మన భద్రతకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయి. ఉపగ్రహాలను, యుద్ధనౌకలను విధ్వంసం చేయగల క్షిపణులను కూడా చైనా రూపొందించింది. 8500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేదించగల అణ్వస్త్రాలను మోసుకొని పోగల 'జలాంతర్గాములు' అనేకం చైనా వద్ద ఉన్నాయి. 

ఈ ప్రమాదాలను ప్రతిఘటించడానికి  వలసిన రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం మనకు అనివార్యం.

మన వాణిజ్య ప్రాంగణాలలో చైనా వారి వస్తువులు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా స్వదేశీయ పరిశ్రమలు చతికిల పడి ఉన్నాయి. మన దేశం నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న వస్తువుల విలువకంటే చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న సరుకుల విలువ చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా మనం వాణిజ్య పరమైన లోటు (ట్రేడ్ డెఫిసిట్) నకు గురి అవుతున్నాము. ఈ లోటు పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. సమాచార సంచార - టెలి కమ్యూనికేషన్ల రంగంలో మొదటితరం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే మనం పెంపొందించుకో గలిగాము. రెండో తరం 'తరంగాల' స్పెక్ట్రం పరిజ్ఞానం సమగ్రంగా రూపొందనే లేదు. ఫలితంగా మూడవ తరం, నాలుగవ తరం టెలికం తరంగాల పరిజ్ఞానాన్ని చైనా నుండి దిగుమతి చేసుకొంటున్నాము. ఇలా అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని చైనా మనకు సరఫరా చేయడం వల్ల మన సమాచార దూర సంచార వ్యవస్థ గుట్టు మొత్తం ఆ దేశానికి తెలిసిపోతోంది. ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన పాటవం విషయంలో ఇలా చైనా దయాదాక్షిణ్యాలపై అతిగా ఆధారపడవలసిన దిస్థితి మన భద్రతకు ప్రమాదకరం.  

టిబెట్ నుంచి భ్రహ్మపుత్ర నదీ జలాలు మనదేశంలోనికి రాకుండా చైనా ప్రభుత్వం నిరోధించడానికి యత్నిస్తోంది. తమ దేశం నుంచి పొరుగు దేశాలలోకి ప్రవహిస్తున్న ఇతర నదులపై కూడా చైనా ప్రభుత్వం అక్రమంగా ఆనకట్టలను నిర్మించి నీటిని కాజేస్తోంది. ఇలా నదుల నీటిని మళ్ళించడం వల్ల నష్టపోతున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, లావోస్, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, బర్మా వంటి దేశాలతో కలిసి మన ప్రభుత్వం చైనా ప్రభుత్వాన్ని నిలదీయ గలగాలి. నదుల నీటిని న్యాయమైన రీతిలో పంచుకొనేందుకు చైనాను ఒప్పించగలగాలి. 

పాకిస్తాన్ కుట్ర 
పాకిస్తాన్ ప్రభుత్వ చర్యల వల్ల మన పడమటి సరిహద్దులకు ప్రమాదం పెరుగుతోంది. పాకిస్తాన్ వైపు నుంచి మన దేశంలోకి చొరబడుతున్న అక్రమ ప్రవేశకుల సంఖ్య గత కొన్ని నెలలుగా పెరుగుతోందని, ఉన్నత సైనిక అధికారుల సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా, ఇటీవల మన ప్రధానమంత్రి స్వయంగా వెల్లడించారు. కాశ్మీర్ లోనే వాస్తవాధీన రేఖ వెంబడి, గత నాలుగున్నర నెలల కాలంలో డెబ్భై చొరబాటు సంఘటనలు జరిగినట్లు తెలిసింది. కొన్ని సందర్భాలలో పాకిస్తానీ ప్రభుత్వ దళాలు మన సైనికులపై కాల్పులు కూడా జరిపాయి. పాకిస్తాన్ సైనిక దళాలలో మత మౌడ్య వాద ప్రభావం పెరుగుతోంది. పాకిస్తాన్లోని అణ్వస్త్ర భాండాగారాలను  స్వాధీనం చేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది. 

అంతర్జాతీయ బీభత్సకాండను ఉసిగొల్పిన ఒసామాబిన్ లాడెన్ ఇటీవల పాకిస్తాన్ లో హతమారి పోయాడు. కానీ అంతకుముందు అనేక సంవత్సరాలపాటు బిన్ లాడెన్ సకుటుంబ సమేతంగా పాకిస్తాన్ లో సురక్షితంగా మనుగడ సాగించగలిగాడు. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగం 'ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ ఏజన్సీ' ఐ.ఎస్.ఐ., పాకిస్తాన్ సైన్యం అంతర్జాతీయ బీభత్స వ్యవస్థకు అండగా నిలబడి ఉన్నాయన్న సత్యానికి ఇంతకుమించిన సాక్ష్యం అక్కరలేదు. ఒసామా ఆచూకీని కనుగొనడంలో అమెరికా దళాలకు సహకరించిన ఒక డాక్టర్ పై పాకిస్తాన్ ప్రభుత్వం దేశద్రోహ నేరాన్ని ఆరోపించి విచారించడం గమనించదగిన పరిణామం.

డిల్లీ హైకోర్టు ప్రాంగణంలో ఇటీవల బాంబులు పేల్చి బీభత్సం సృష్టించింది 'ఐ.ఎస్.ఐ' వారేనని ధృవపడింది. మావోయిస్టు బీభత్స కారులకు చైనా ప్రభుత్వం సహాయాన్ని అందచేయడంలో ఐ.ఎస్.ఐ. అనుసంధాన వ్యవస్థగా పని చేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ లో కర్జాయ్ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెళ్ళిపోయిన తరువాత అక్కడ మళ్ళీ 'తాలిబాన్ల' ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్నది పాకిస్తాన్ వ్యూహం. తాలిబాన్ బీభత్సకారులు మనదేశాన్ని బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ తాలిబాన్ల పెత్తనం నెలకొన్నట్లయితే అది మన దేశానికి మరింత ప్రమాదకరం కాగలదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో సంభవిస్తున్న ఈ పరిణామాలను గమనించవలసిందిగా 'అఖిల భారత కార్యకారీ మండల్' కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. కానీ మన ప్రభుత్వ స్పందన మాత్రం చాలా పేలవంగా ఉంది !

బంగ్లాదేశ్ తో సరిహద్దు సమస్యలు
 
గత సెప్టెంబర్లో మన ప్రభుత్వం బంగ్లాదేశ్ తో జరిపిన చర్చల సందర్భంగా జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అస్సాంలోనూ, బెంగాల్ లోను, ఉన్న వేలాది ఎకరాల భూమిని బంగ్లాదేశ్ కు అప్పగించడం గర్హనీయం.  ఈ భూమి ఇదివరకే బంగ్లాదేశ్ అధీనంలో ఉందని మన ప్రభుత్వం చెప్పడం కుంటిసాకు మాత్రమే. 'ప్రాదేశిక వినిమయం' పేరుతో బంగ్లాదేశ్ కు ఎక్కువ భూమిని బదిలీ చేయడం ఆ దేశం నుంచి మన దేశానికి తక్కువ భూమిని రాబట్టడం తెలివి తక్కువ తనానికి నిదర్శనం. అనేక వేల మంది బంగ్లాదేశీ ముస్లింలు భారతీయ పౌరులుగా పరిగణన పొందడానికి ఈ 'బదలాయింపు' దోహదం చేసింది. కూచ్ బిహార్, జల్పాయిగురి ప్రాంతంలోని ప్రజల మత నిష్పత్తిలో వైపరీత్యాలు ఏర్పడడానికి ఈ చర్య దోహదం చేసింది. దీనివల్ల ఈ ప్రాంతంలో విచ్ఛిన్నవాదం బలం పుంజుకునే ప్రమాదం పొంచి ఉంది. బంగ్లాదేశ్ తో మన ప్రభుత్వం జరుపుతున్న చర్చల సందర్భంగా, మన దేశంలో అక్రమంగా నివసిస్తున్న కోట్లాది మంది బంగ్లాదేశీయులను ఆ దేశానికి తరలించే అంశం ప్రస్తావనకు రాకపోవడం మిక్కిలి దురదృష్టకరం.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు
 
క్రొత్త పెత్తందార్ల మధ్య ఆధిపత్య సమరానికి హిందూ మహా సముద్రం ప్రాంతం ప్రాతిపదిక కావడం ఆందోళన కలిగిస్తున్న మరో పరిణామం. ఈ కొత్త సమరాంగణం గతంలో ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఐరోపాను తలపిస్తోంది. హిందూ మహా సముద్ర తీరస్థ దేశాలు ప్రాకృతికమైన సంపదకు ఆలవాలమై ఉన్నాయి. ఆధిపత్య సమరంలో వ్యూహాత్మకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. 

హిందూసాగర ప్రాంతంలో చైనా తన నౌకా దళాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ధ సంబంధ కార్యకలాపాలను విస్తరింపచేస్తోంది. ఈ ఆధిపత్య ధోరణి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. తీరస్థ దేశాలకు దూరంగా డియాగో గార్సియా దీవులలో అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. అయితే భారతదేశానికి మరింత సమీప ప్రాంతాలలో తమ సైనిక స్థావరాలు నెలకొల్పాలన్నది అమెరికా తపన. 2003లో ఇండోనేషియా నుంచి విడివడి 'తూర్పు తైమూర్' స్వతంత్ర దేశంగా అవతరించడం, శ్రీలంక ప్రభుత్వానికీ, తమిళ ఈలం లిబరేషన్ టైగర్ - ఎల్.టి.టి.ఇ. - ముఠాకు మధ్య కొనసాగిన పోరాటం, తైవాన్ స్వాతంత్ర్య సమస్య - ఇలాంటి పరిణామాలు హిందూ సాగర ప్రాంతంలో అమెరికా చైనాల మధ్య ఆధిపత్య సమరాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఇది ఉద్రిక్తతలు చెలరేగడానికి దారి తీస్తోంది. ఈ పరిస్థితులలో మనదేశం మౌన వీక్షక పాత్రను పోషించరాదని 'అఖిల భారత కార్యకారీ మండల్' అభిప్రాయపడుతోంది. మనదేశ ప్రభావం పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ప్రశాంత సుస్థిర వ్యవస్థ ఏర్పడగలదని హిందూ మహా సముద్ర తీరస్థ దేశాలలో అధికశాతం భావిస్తున్నాయి.

తూర్పువైపుగా అన్వేషణ - లుక్ ఈస్ట్ - అన్న మన ప్రభుత్వ విధానానికి అంకురార్పణ జరిగి ఇరవై ఏళ్ళ పైబడింది. తూర్పు వైపుగా అన్వేషణ ఇకపై 'తూర్పు ప్రాంతంలో కార్యాచరణ' - యాక్ట్ ఈస్ట్ - గా పరివర్తన చెందాలని 'అఖిల భారతీయ కార్యకారీ మండల్' కోరుతోంది. తూర్పు ఆసియా ప్రాంతంలోని అధికాధిక దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకునే దిశగా మన ప్రభుత్వం ఈ కార్యాచరణను చేపట్టాలి. ప్రధానంగా బర్మా, వియత్నాం వంటి దేశాలతో మన స్నేహం వర్ధిల్లాలి. 

ఇటీవలి కాలంలో దక్షిణ చైనీయ సముద్ర ప్రాంతంలో మన నౌకాదళాన్ని నిరోధించడానికి చైనా దళాలు దురుసుగా ప్రవర్తించాయి. అలాగే అరేబియా సముద్ర ప్రాంతంలో మన నౌకపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. చైనా దాని మిత్ర దేశాలు మన దేశానికి వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరికి ఇలాంటివి ఉదాహరణలు. పశ్చిమ పాకిస్తాన్ లోని 'గ్వాదార్' ఓడరేవు మొదలుకొని తూర్పు సముద్ర జలాలలో 'కోకో' ద్వీపాల వరకు గల సువిశాల సీమలలో చైనా యుద్ధనౌకలు నిరంతరం విహరిస్తున్నాయి. ఇలా చైనా ప్రభావం పెరగడం వల్ల మూడు వైపులా ఉన్న సముద్ర జలాలలో మన దేశానికి ముప్పు ముంచుకొస్తోంది. హిందూ మహా సముద్రంలోని నైరుతి ప్రాంతంలో పాలీమెటాలిక్ సల్ఫైడ్  ఖనిజాల కోసం అన్వేషణ జరిపేందుకు చైనాకు హక్కులు లభించాయి. దానికోసం పదివేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని 'అంతర్జాతీయ సముద్ర నిర్వహణ సంస్థ' వారు చైనాకు అప్పగించారు. 'అన్వేషణ' సాకుతో చైనా ప్రభుత్వం తమ నౌకాదళాన్ని ఈ ప్రాంతంలో భారీగా మోహరించే ప్రమాదం ఉంది. 

చైనా పాకిస్తాన్ల దురాక్రమణను తిప్పికొట్టగల సామర్ధ్యం మన సైనిక దళాలకు ఉంది. మన సైనికులు తమ సమర పటిమను గతంలో అనేకసార్లు నిరూపించారు. కానీ మన సైనిక దళాలు మరింత సమర్ధవంతంగా పోరాడడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చడంలో మన ప్రభుత్వం పదేపదే విఫలమౌతోంది.

సామాన్య ప్రజా హృదయాలలో పెల్లుబుకుతున్న జాతీయ ఆకాంక్షలకూ, అధికార రాజకీయ విధానాలకు మధ్య ఓ పెద్ద అఖాతం ఏర్పడి ఉంది. శాస్త్ర విజ్ఞాన పటిమ, రక్షణ సామర్ధ్యం, దేశభక్తియుతమైన జాతీయ భావస్ఫూర్తి మనకు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇవేవీ మన రాజకీయ విధాన రూపకల్పనలో ప్రస్ఫుటించడం లేదు. 

మన భద్రతకు భంగం వాటిల్లచేస్తున్న ఈ పరిణామాల నేపథ్యంలో, మన సరిహద్దుల రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా 'అఖిల భారత కార్యకారీ మండల్' కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. హిందూ మహా సాగర ప్రాంతంలో మన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి కావలసిన చర్యలను గైకొనాలని కోరుతోంది. విచ్చిన్నకారులను, బీభత్స కారులను, అక్రమ ప్రవేశకులను అరికట్టడానికి పటిష్టమైన వ్యూహాన్ని అమలు జరపాలని 'అఖిల భారత కార్యకారీ మండల్' ప్రభుత్వాన్ని కోరుతోంది. సమగ్ర రక్షణ యంత్రాంగాన్ని పెంపొందించాలని ఆర్ధిక, ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన స్వయంసమృద్ధి సాధనకై కృషి చేయాలని కోరుతోంది. జాతీయ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను పెంపొందించడానికి కావలసిన చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలని ఈ తీర్మానం ద్వారా 'అఖిల భారత కార్యకారీ మండల్' దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. 
http://www.lokahitham.net/2011/12/blog-post_2342.html

No comments:

Post a Comment