Tuesday, December 27, 2011

చిల్లర వ్యాపారంలోకి విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్న కేంద్ర ప్రభుత్వం


దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నా, UPA భాగస్వామ్య పక్షాల నుండి అభ్యంతరం వ్యక్తమవుతున్నప్పటికీ చిల్లర (రిటైల్) వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంలో వెనక్కు తగ్గేది లేదని, అవసరమైతే మధ్యంతర ఎన్నికలకు సిద్ధమని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేసినట్లు డిశంబర్ 2 నాటి దినపత్రికలలో వచ్చింది. అంటే దేశంలోని నాలుగు కోట్లకు పైగా చిల్లర వ్యాపారులు బజారున పడినా ఫర్వాలేదనుకుంటున్నారు  మన ప్రధాని. 

దేశానికి భారం కాకుండా బ్రతుకుతున్న చిల్లర వ్యాపారులను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు గతంలో మేము వ్రాశాము. ఆ నిర్ణయం తీసుకోవటానికి ప్రభుత్వము కృత నిశ్చయంతో ఉన్నట్లు ఇప్పటి పరిస్థితులను బట్టి అర్ధమవుతున్నది.

చిల్లర వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానిస్తే దేశంలో అదనంగా కోటిమందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉన్నదని ఆశ చూపుతున్నారు. ఇది యెట్లా సాధ్యమవుతుందో మాత్రం చెప్పటం లేదు. ఒక ప్రక్క నిరుద్యోగులకు ఈ రకమైన ఆశలు చూపిస్తూ మరోప్రక్క తమ వ్యాపారం తాము చేసుకొంటూ స్వతంత్రంగా బ్రతుకుతున్న వారి స్వతంత్రాన్ని ప్రశ్నార్ధకంగా మార్చాలనుకొంటున్నది  ఈ ప్రభుత్వం. చిల్లర వ్యాపార రంగంలో విదేశీ సంస్థలు ప్రవేశిస్తే ద్రవ్యోల్బణం తగ్గిపోతుందని రిజర్వ్ బ్యాంకు వారి కథనం. ఇది ఎట్లా అనేది చెప్పదు. అంటే ప్రజలను మభ్య పెట్టేందుకు రకరకాల ఆశలు చూపిస్తున్నారు. ఏతావాతా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక సంస్కరణల ప్రభావం ఎట్లా ఉంది అంటే భయంకరంగా ఉన్నాయి. గ్రామాలలో వ్యవసాయం చేసుకోవటం, చిన్న చిన్న పనులు చేసుకోవటం కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామ జీవనంలో పరస్పర విశ్వాసం దూరమవుతున్నది. 1890 -1950 మధ్య కాలం నాటి గ్రామాల పరిస్థితులు వివరిస్తూ విశ్వనాధ సత్యనారాయణ వ్రాసిన "శార్వరి నుండి శార్వరి వరకు" అనే సామాజిక నవలలలో "గ్రామాలలో పాలు లేవు, దొరకటం లేదు, సోడాలు మాత్రం దొరుకుతున్నాయి, పండ్లు కూరగాయలకు బదులు చాకిలెట్లు, కూల్ డ్రింకులు దొరుకుతున్నాయి" అని వ్రాశారు. నేటి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితులు ప్రజల జీవన విలువలు, సంస్కారాలను నాశనం చేసే ప్రక్రియను వేగం చేయటానికి దారి తీస్తున్నవి.


http://www.lokahitham.net/2011/12/5113.html

No comments:

Post a Comment